కబుర్లు, ముచ్చట్లు

ఈ రోజు కాస్త"కబుర్ల"గురించి"ముచ్చట్లు"చెప్పుకుందాం-వాటి కధా కమామీషూ- కొద్దిగా వివరంగా,విశేషంగా!!

“కబుర్లు” నిర్వచనం: విశేషాలు ఏమీ లేకపోయినా చెప్పుకునేవే కబుర్లంటే! వాడేవాళ్లు: అందరూనూ!

వర్తించేది: అందరికీనూ!

అలా అని ఈ కబుర్లని తక్కువ అంచనా వేయలేము, ఆషామాషీగా కొట్టిపారేయలేము-ఎందుకంటే అందరికీ కబుర్లు చెప్పడం రాదుకదా-కబుర్లలో బోలెడు రకాలాయే!

సొల్లు కబుర్లు

కాలక్షేపం కబుర్లు
అమ్మలక్కల కబుర్లు
పోసుకోలు కబుర్లు
సరదా కబుర్లు
సెల్లు కబుర్లు
ముఖ పుస్తకపు కబుర్లు
ట్విట్టర్ కబుర్లు
ఇంస్టాగ్రామ్ కబుర్లు
కాలేజీ కబుర్లు
స్కూల్ కబుర్లు
ఆఫీస్ కబుర్లు
ప్రేమికుల కబుర్లు
ఆలు మగల కబుర్లు
స్నేహితుల కబుర్లు
హితుల కబుర్లు
సన్నిహితుల కబుర్లు
సహాద్యోగుల కబుర్లు
నిరుద్యోగుల కబుర్లు
విద్యార్థుల కబుర్లు
ఇరుగుపొరుగుల కబుర్లు
అమ్మాయిల కబుర్లు
అబ్బాయిల కబుర్లు
మేధావి కబుర్లు

ఇంకా నేను కూడా చెప్పలేనన్ని రకరకాల కబుర్లు

ఇవి అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యఔషధాలే!!! ఏది ఏమైనా ఒక్కో “కబుర్లు” ఒకోరకంగా ఉంటాయి, సారాంశం మాత్రం- సర్వసాధారణంగా “ఒట్టి కబుర్లే”!

ఇప్పుడు ముచ్చట్ల విషయానికి వద్దాం...

ముచ్చట్లు, కబుర్లు పదాలకు ఒకే అర్ధం అయినా ముచ్చట్లు అనే మాటను మాత్రం ఆడవాళ్లకే ఎక్కువగా అన్వయిస్తూ ఉంటారు.బహుశా ఆడవాళ్లు మాట్లాడుకుంటూవుంటే “చూట్టానికి ముచ్చటగా ఉంటుంది కాబట్టి” (వాళ్లలాగే) ముచ్చట్లు అనే పదం వాళ్లకు ఆపాదించివుంటారు,కబుర్లు అనే పదం మగాళ్ళకి పడేసి-ఎంతైనా మన పూర్వీకులు-భావుకులు కదా- “భావకవులు” బావికవులు కాదు!!

అసలు విషయం,దాని మూలాలు – “గరికపాటి”లాంటి వారు మాత్రమే చెప్పగలరు- కానీ ఇలాంటి విషయాన్ని ఆయన్ని అడిగితే ఇంకేమైనా ఉందా-నన్ను యతి ప్రాసలతో ఓ మత్తేభంతో ఘీంకరించగలరు- నాకు కంద మూలాలు కూడా తినే యోగ్యతలేదని సెలవిచ్చేస్తారు కూడానూ.

కానీ మనం కబుర్లు ఎందుకు చెపుతాం అండీ,రోజూవారి ఉండే చికాకులు నుంచి కాస్త మనసుకు మార్పు మరియూ ఈ కబుర్లు కాస్త ఉల్లాసాన్ని ఇస్తాయి ఖచ్చితంగా-అందునా హాస్యం పాళ్ళు కలిపితే- పరవాన్నంలో జీడీ పప్పు,కిస్మిస్, నాలుగు డ్రై ఫ్రూట్ ముక్కలు నేతితో వేయించి కలిపితే అదరహాగా ఉండదూ-మరి ఈ కబుర్లు అంటే అలాగే పనిచేస్తాయి.

ఎప్పుడూ మొహం వేలాడేసుకొని,ఏదో కోల్పోయినట్టు కూచుంటే మనకీ బాగుండదు,ఇంకోడెవడు మన దరిదాపులకే చేరడు.మీరు గ్రహించి ఉంటే మనం అందరం కూడా కాస్త సరదాగా కబుర్లు చెప్పేవాళ్ళంటే ఇష్ట పడతాం.ఎంచేత? వాళ్ళ కబుర్లు “ఉల్లాసం,ఉత్సాహం” ఇస్తాయి కనక("ఉల్లాసంగా, ఉత్సాహంగా"అని ఎడవెర్టై జ్ మెంట్ వస్తుందిగదా-అలాగన్నమాట!) అంతేగానీ నవ్వేవాళ్ళు బుర్ర తక్కువ గాళ్ళు,తామే మేధావులం అనే భావన తప్పు కాదూ!

ఈ కబుర్లు చెప్పడం వల్ల, వినడం వల్ల కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.అంచేత కబుర్లు చెబుతూ ఉండండి చెప్పగలిగితే,లేకపోతే కనీసం అప్పుడప్పుడన్నా వింటూ ఉండండి.

అందునా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు నెలలనించి “ఒంటి పిల్లి రాకాసుల్లా” బతికేస్తున్నాం,అప్పుడప్పుడు బయటకి వెళ్లినా కూడా,ఇంకా ఎన్నాళ్ళో తెలియదు.అంచేత ఫోన్లో అన్నా కబుర్లు చెప్పండి, వినండి, చదవండి- కబుర్లలో కాస్త హాస్యాన్ని కలపండి-కాస్త పంచదార నోట్లో వేసుకున్నట్టు.

ఇలా చేస్తే- రోగనిరోధకశక్తి కషాయాలు, మాత్రలు వేసుకోవక్కర్లా- ఇవే ఇమ్మ్యూనిటి బూస్టర్ల లాగ పనిచేస్తాయి- కరోనా అయితే హడిలి చస్తుంది మన దగ్గరకి రావటానికి- నిజ్జం, నా మీద ఒట్టు!

ఇక ఆపుతా నా కబుర్లు, కబుర్ల పేరుతొ నా కాసిని ముచ్చట్లూ చేప్పేసా ఈ రోజుకి- కడుపు నిండిపోయింది నాకైతే!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!